మనోవిజ్ఞాన శాస్త్రం
మనం ప్రతిరోజూ అనేకమంది వ్యక్తులను చూస్తుంటాం.అలాగే వాళ్ళ ప్రవర్తనలో అనేక రకాల తేడాలను కూడా గమనిస్తుంటాం.అంతేకాక ఒకే వ్యక్తి విభిన్న పరిస్తితులలో వివిధ రకాలుగా ప్రవర్తిస్తుంటాడు.అయితే నిశితంగా లేదా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ వైవిధ్యంలో కూడా ఒక క్రమం ఉందని మనకు తెలుస్తుంది.ఇటువంటి పరిశీలనలను,పరిశోధనలను ఆధారం చేసుకొని ప్రవర్తనల పట్ల కొన్ని ప్రాగుక్తులను చేయవచ్చుననే భావం మనకు స్పురిస్తుంది.ఇటువంటి ప్రయత్నాలకు ఉద్దేశించినదే మనోవిజ్ఞాన శాస్త్రం.మరో విధంగా చెప్పాలంటే మానవుని ప్రవర్తనలలో ఉన్న కారకాలను తెలుసుకోవడంలో మనోవిజ్ఞాన శాస్త్రం ఆసక్తిని కనబరుస్తుంది.అంటే వ్యక్తి ఒక రీతిలో ప్రవర్తిస్తున్నాడన్న విషయాన్ని తెలుసుకోవడానికి మనోవిజ్ఞాన శాస్త్రం ప్రయత్నిస్తుంది.
మనోవిజ్ఞాన శాస్త్రం ఒక ప్రత్యేక శాస్త్రం గా రూపొంది సుమారు 126 సంవత్సరాలయింది.
1879 లో జర్మనీ లోని లీప్ జిగ్ నగరంలో విల్ హెల్మ్ ఊంట్ అనే శాస్త్రజ్ఞుడు మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను ప్రారంభించడంతో మనోవిజ్ఞాన శాస్త్రం సంప్రదాయ బద్దమైన,స్వతంత్ర మైన ఒక వైజ్ఞానిక శాస్త్రం గా ప్రారంభ మైనదని చెప్పవచ్చు.
19 వ శతాబ్దం మధ్య వరకు మనోవిజ్ఞాన శాస్త్రం తత్వశాస్త్రం లో ఒక భాగంగా ఉండేది.
ప్రస్తుతం మనోవిజ్ఞాన శాస్త్రం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుంది.ప్రపంచమంతటా ఈ శాస్త్ర అధ్యయనం చురుగ్గా జరుగుతుంది.ఈ శాస్త్ర అధ్యయనం లో అనేక సాంప్రదాయాలు వెలిశాయి.ఈ శాస్త్రం మిగతా శాస్త్రాలను కూడా ప్రభావితం చేయడం మొదలుపెట్టింది.