సహజ పరిశీలన (Naturalistic Observation)
పరిశీలన అంటే మామూలుగా చూడడం కాక, ఒక వ్యక్తి ముందుగా నిర్ణయించుకున్న పరిశీలనాంశాలను సన్నద్ధతతో, స్పష్టంగా, నిశితంగా చూడడం అని నిర్వచించవచ్చు. పరిశీలనాంశం ఒక వ్యక్తి ప్రవర్తన కావచ్చు, కొంత మంది వ్యక్తుల ప్రవర్తన కావచ్చు. వ్యక్తుల పరిసరాలతో స్పందించే తీరు కావచ్చు లేదా ఏదైనా దృగ్విషయం కావచ్చు. పరిశీలనాంశాలను సహజ పరిస్థితులలో జరుగుతున్నప్పుడు పరిశీలించడాన్నే సహజ పరిశీలన అంటారు. ఉదాహరణకు వివిధ సామాజిక వర్గాలకు చెందిన పిల్లలు వారి బాల్యాన్ని ఎలా అనుభవిస్తున్నారో తెలుసుకొనుటకు వారు నివసిస్తున్న ఇండ్ల వద్దకు వెళ్ళి వారు ఏమి చేయుచున్నారో ప్రత్యక్షంగా పరిశీలించి తెలుసుకోవడం.
ఈ పద్ధతిలో సహజ పరిస్థితులలో ప్రవర్తనాంశాలను పరిశీలించటం జరుగుతుంది. కాబట్టి పిల్లల ప్రవర్తన పట్ల ఒక ఖచ్చితమైన అవగాహనకు రావచ్చును. పరిశీలించబడే వ్యక్తులకు వారు ఇతరులచే పరిశీలించబడుతున్నామనే విషయం తెలిస్తే వారి ప్రవర్తనలో మార్పు వచ్చే అవకాశం ఉన్నది. కావున పరిశీలించబడుతున్నామనే విషయం తెలియకుండా జాగ్రత్త వహించాలి. సహజ పరిశీలనలో పరిశీలించే అంశాలను నమోదు చేయడం కొంత కష్టంతో కూడిన పని ఎందుకంటే పరిశీలించే దత్తాంశాన్ని నమోదు చేస్తే అది పరిశీలించబడే వ్యక్తులకు తెలిసే అవకాశం ఉన్నది. అంతే కాకుండా పరిశీలిస్తూ నమోదు చేస్తే, నమోదు చేసే సమయంలోని ప్రవర్తనాంశాలను సరిగ్గా పరిశీలించలేరు. ఈ పద్ధతిలోని ఈ పరిమితిని అధిగమించుటకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని అటు పరిశీలింపబడే వ్యక్తులకు తెలియకుండాను, అదే విధంగా ప్రవర్తనాంశాల లోని అన్ని విషయాలను నమోదు చేయవచ్చును. ఈ పద్ధతిలోని మరో పరిమితి ఏమంటే వ్యక్తుల బాహ్యప్రవర్తనకు మాత్రమే పరిశీలించగలుగుతాం, కాని వారి అంతర్గత మానసిక ప్రక్రియలను పరిశీలించలేం. అయితే మానసిక ప్రక్రియలను ప్రత్యక్షంగా పరిశీలించలేకపోయినప్పటికి, సహజపరిస్థితులలో వారి ప్రవర్తనను పరిశీలిస్తాం కాబట్టి వారి మానసిక ప్రక్రియల గురించి కూడ ఒక అంచనాకు రావచ్చు.
ఉపయోగాలు
1. ఇది చాలా సులభమైన పద్ధతి. పరిశీలించడం అనేది మానవునికి సహజంగానే వచ్చిన గుణం కావున కొద్దిపాటి శిక్షణ సరిపోతుంది.
2. ప్రవర్తనాంశాలను సహజపరిస్థితులలో పరిశీలిస్తాం, కాబట్టి ప్రవర్తనాంశాల పట్ల ఖచ్చితమైన అవగాహన వస్తుంది.
3. తమ భావాలను వ్యక్త పరచలేనటువంటి పిల్లల, మానసిక రోగుల, జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి ఈ పద్ధతి ఎక్కువ ఉపయుక్తంగా ఉంటుంది. 4. దత్తాంశాన్ని సులభంగా సేకరించవచ్చు.
5. వివిధ నేపథ్యాలు కలిగిన పిల్లల బాల్యానికి సంబంధించిన స్థితిగతులను ఈ పద్ధతిని ఉపయోగించి సులభంగా తెలుసుకోవచ్చు.
6. నేడు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నందున పరిశీలనాంశాలను సులభంగానే నమోదు చేయవచ్చు.
పరిమితులు
1. పరిశీలించబడే వ్యక్తులకు పరిశీలించబడుతున్నామని తెలిస్తే వారి ప్రవర్తనలో మార్పు వచ్చే అవకాశముంది.
2 సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించక పోతే పరిశీలనాంశాలను అప్పటికప్పుడు నమోదు చేయడం కష్టం నమోదు చేయని యెడల తదుపరి ఆ ప్రవర్తనను నమోదు చేయాలంటే జ్ఞప్తికి రాకపోవచ్చు.